నిరుద్యోగుల ఆత్మహత్యల పాపం సర్కారుదే

నిరుద్యోగం.. తెలంగాణ యువతకు నిద్రలేకుండా చేస్తోంది. 35-–40 ఏండ్లు నిండుతున్నా ఉపాధి లేక, పెండ్లి కాక, ఏం చేయాలో అర్థంకాక యువత బలవన్మరణాలకు పాల్పడుతోంది. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 30 మంది యువతీయువకులు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదని కలత చెంది, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. చెట్టంత ఎదిగిన బిడ్డలను కోల్పోవడంతో.. ఆయా కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. బంగారు తెలంగాణ అని గొప్పలు చెబుతున్న గులాబీ బాస్ ఇంతమంది  బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంటే ఎందుకు నోరు మెదపడం లేదు. రాష్ట్ర సాధన కోసం 1,230 మంది ఆత్మబలిదానాలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆత్మహత్యలు కొనసాగడానికి కారకులెవరో సమాధానం చెప్పాల్సిన అవసరం కేసీఆర్ పైనే ఉంది.

ప్రాణాలు తీసుకుంటున్న నిరుద్యోగులు

ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదనే మనోవేదనతో మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లలో మహేందర్ యాదవ్ అనే బీటెక్ స్టూడెంట్​ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా రాంసింగ్ తండాకు చెందిన కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ బోడ సునీల్ నాయక్ సూసైడ్​ రాష్ట్రంలో కలకలం రేపింది. ఖాళీలను భర్తీ చేయడం లేదని మనోవేదనకు గురై, కేసీఆర్ పాలనను నిరసిస్తూ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం దిగ్ర్భాంతికి గురి చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్ లో పీహెచ్​డీ పూర్తి చేసిన నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంగ్లీష్ స్కాలర్ రవీందర్ నాయక్ ఉప్పల్​లో ఉరి వేసుకుని ఉసురు తీసుకున్నాడు. ఓయూ పీజీ స్టూడెంట్ మురళీ ముదిరాజ్, కొప్పు రాజు బలన్మరణాలకు పాల్పడ్డారు. వీరిద్దరి గ్రామాలు సీఎం ఫాంహౌస్​కు కూతవేటు దూరంలోనే ఉంటాయి. సాక్షాత్తూ సీఎం ఇలాకాలోనే ఇద్దరు నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోవడం ఈ ప్రభుత్వానికే సిగ్గుచేటు. 

తెలంగాణ ఉద్యమం నుంచే కేసీఆర్​ కుట్రలు

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, ఉద్యమం మరొకరి చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని, దళితుడిని సీఎం చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. నిజానికి ఆ రోజు మేధావి వర్గం కూడా కేసీఆర్ కుట్రలను పసిగట్టలేదు. ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో ప్రజలంతా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ల పోరాటానికి మద్దతు తెలుపుతున్న క్రమంలో.. స్టూడెంట్ల ఉద్యమాన్ని నీరుగార్చే ప్రకటనలు చేసిన సందర్భాలు లేకపోలేదు. స్టూడెంట్లు ఆకాశం నుంచి ఊడిపడలేదు.. పైసలిస్తేనే ఉద్యమం చేస్తున్నారని ప్రకటించి స్టూడెంట్ల ఉద్యమాన్నే కేసీఆర్​ అవహేళన చేశారు. ఉద్యమాన్ని నీరుగార్చడానికి కేసీఆర్ చేసిన కుట్ర ప్రయత్నాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.

నియామకాల విషయంలో అట్టర్​ఫ్లాప్

నియామకాల విషయంలో కేసీఆర్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని కాలర్ ఎగరేసిన తెలంగాణ నిరుద్యోగులు ఇప్పుడు అవమానంతో తల దించుకుంటున్నారు. ఇలాంటి తెలంగాణ కోసమేనా మనం ఇన్నాళ్లూ పోరాటం చేసింది. ఆకలిని చంపుకుని, అవమానాలను దిగమింగుకుని, అగ్గి బరాటాలై సమరం చేసింది నిరుద్యోగాన్ని కానుకగా పొందేందుకేనా? అని వారంతా డిఫెన్స్ లో పడిపోయారు. ఎవరి ముందు ఉద్యమ నినాదాలు చేస్తూ ఉక్కు పిడికిలి బిగించి జై తెలంగాణ అన్నారో, ఆయనేనా తెలంగాణను పాలిస్తున్నాడనే సందేహంలో పడిపోయారు. నాడు టియర్ గ్యాస్ ను ఢీకొట్టిన గుండె నిబ్బరం.. నేడు దొర ఆధిపత్యాన్ని అంగీకరించక ఉరికొయ్యకు వేలాడుతోంది. అమ్మకు ఇచ్చిన మాట కోసం రాత్రి పగలు తేడా లేకుండా చదివినా కొలువులు రాకపాయే. నోటిఫికేషన్లు రాక, వచ్చిన ఒకటి, రెండు నోటిఫికేషన్లు కూడా కోర్టు కేసులతో ఆగిపోవాలనే దుర్భుద్ధి ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్యోగం పొందడం నిజంగా అత్యాశే అవుతుంది.

మూడ్రోజులు అడిగితే.. 7 గంటలే ఇస్తరా?

అయితే.. ఇందిరా పార్క్ వద్ద షర్మిల నిరాహార దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజే అనుమతివ్వడం శోచనీయం. బంగారు తెలంగాణలో గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేసి నిరసన తెలిపే హక్కు కూడా మాకు లేదా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. రాజ్యాంగ హక్కులను కాలరాసే అధికారం తెలంగాణ పాలకులకు ఎవరిచ్చారు? కరోనా నిబంధనలను తుంగలో తొక్కి నాగార్జునసాగర్​లో లక్ష మందితో సీఎం సభను పెట్టుకోవచ్చు. కరోనా నిబంధనలు పాటిస్తూ మూడ్రోజుల పాటు శాంతియుతంగా నిరాహార దీక్ష చేయడానికి పర్మిషన్ అడిగితే.. ఒక్క రోజులో అది 7 గంటలే పర్మిషన్ ఇవ్వడం ఎంత వరకు న్యాయం? నిరాహార దీక్ష చేస్తామంటే ప్రభుత్వానికి వణుకెందుకు పుడుతోంది.
భర్తీ చేసిన ఉద్యోగాలు 35,460 మాత్రమే
తెలంగాణలోని వివిధ ప్రభుత్వశాఖల్లో మొత్తం 3 లక్షల 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా.. వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి మనసొప్పడంలేదు. ఏడేండ్లుగా గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోతుంది. ఏయే అంశాల ప్రాతిపదికన ఉద్యమం జరిగిందో ఆ ఆకాంక్షలు నెరవేరకపోగా.. కనీసం ఆచరణలోకి కూడా రాలేదు. ఆర్టీఐ ద్వారా నేను తీసుకున్న సమాచారం ప్రకారం ఆరున్నరేండ్లలో రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 35,460 మాత్రమే. కానీ, ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు అప్లై చేసుకున్న నిరుద్యోగులు 40 లక్షల మంది. ఒక్కొక్కరికి 28 నెలలుగా పెండింగ్ లో ఉన్న రూ.84 వేల నిరుద్యోగ భృతిని తక్షణమే.. ప్రతి నిరుద్యోగి అకౌంట్లో వేసి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.

శాంక్షన్డ్​ పోస్టులన్నీ నింపాలి

పీఆర్సీ నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న 1,91,126 శాంక్షన్డ్ పోస్టులను(న్యాయపరంగా క్లియరెన్స్ పొంది, ఆర్థికశాఖ ఆమోదం పొంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్​మెంట్ ఆమోదం పొందినవి) తక్షణమే భర్తీ చేయాలనేది షర్మిల ప్రధాన డిమాండ్. డిపార్ట్​మెంట్ల వారీగా చూస్తే.. హోం శాఖాలో 37,218, స్కూల్ ఎడ్యుకేషన్ 24,702, ఉన్నత విద్య 12,857, హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెర్ఫేర్ 23,512, రెవెన్యూ 8,118, పీఆర్ 5,929, ట్రైబల్ వెల్ఫేర్ 5,852, సోషల్ వెల్ఫేర్ 5,534, అటవీ 3,367, లేబర్, ఎంప్లాయిమెంట్ 2,893, నీటిపారుదల శాఖలో 2,795 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇక శాంక్షన్డ్ కాకుండా ఉన్న పోస్టులు మరో లక్షా 50 వేలు ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిని తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పోటీ పరీక్షలకు ఏజ్ లిమిట్​ దాటిన 2.8 లక్షల మంది నిరుద్యోగులకు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. వీరందరూ ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన వారే. వాళ్ల గురించి ఆలోచించి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
నోటిఫికేషన్లు రాక మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ కళ్లు తెరిచి.. ఉద్యోగ కేలండర్ ను విడుదల చేయాలి. లేనిపక్షంలో నిరుద్యోగులకు బాసటగా షర్మిల తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తారని హెచ్చరిస్తున్నాం.
                                                 ....ఇందిరా శోభన్,షర్మిల ప్రధాన అనుచరురాలు

కల్వకుంట్ల ఫ్యామిలీ.. అబద్ధాలకు బ్రాండ్​ అంబాసిడర్

ఇక అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కల్వకుంట్ల ఫ్యామిలీ మారింది. తండ్రేమో ఇంటికో ఉద్యోగం అనలేదని అబద్ధం ఆడితే, ఆయన కొడుకు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా 32 వేల 899 ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటిస్తారు. ఎవర్ని మోసం చేయాలని ఈ తప్పుడు ప్రకటనలు. చెప్పిన అబద్ధాన్నే పదేపదే చెబుతూ.. దాన్ని నిజం చేయాలనుకుంటోంది కల్వకుంట్ల కుటుంబం. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం తన కూతురు ఒక ఏడాది రాజకీయ నిరుద్యోగిగా ఉంటే విలవిలలాడిపోయారు. ఎంపీ సీటు కోల్పోయిన కూతురికి 16 నెలల్లోనే ఎమ్మెల్సీ సీటు కట్టబెట్టారు. నిరుద్యోగులపై మాత్రం ఎందుకీ వివక్ష? నిరుద్యోగులంతా నీ బిడ్డల్లాంటి వారే కదా సీఎం కేసీఆర్.